నేతలు కించపరిచే, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి: సుప్రీంకోర్టు
ప్రజా ప్రతినిధులు, మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడకుండా స్వీయ నియంత్రణతో ఉండాలని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశ ప్రజలను చులకనగా, తక్కువ చేసి మాట్లాడటం సమంజసం కాదని తెలిపింది. ఇది ఎక్కడా రాతపూర్వకంగా లేకపోయినా, ఇది అందరూ పాటించాల్సిన నిబంధన అని పేర్కొంది. ఇది రాజ్యాంగంలో అంతర్నిహితంగా ఉన్న కట్టుబాటు అని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛతో మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేసే వివాదాస్పద వ్యాఖ్యలపై ఆంక్షలు విధించగలమా? అని దాఖలైన పిటిషన్లపై ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మంగళవారం ఈ పిటిషన్పై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ నేతలు ఏవైనా వివాదాస్పద, కించపరిచే వ్యాఖ్యలు చేస్తే, వారిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధిస్తూ మార్గదర్శకాలను జారీ చేయవచ్చా? అనే అంశంపై మాత్రం తీర్పును రిజర్వు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం.. ఎవరినీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయకూడదనే విషయాన్ని మన రాజకీయ సమాజానికి, పౌర సమాజానికి నేర్పించాలని పేర్కొంది.













