వాట్సాప్ కు సుప్రీం చురకలు ..
ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్తో పాటు దాని మాతృసంస్థ ఫేస్బుక్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ కొత్త ప్రైవసీ పాలసీపై దాఖలైన పిటిషన్పై సుప్రీం విచారణ జరిపింది. నాలుగు వారాల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని వాట్సాప్, ఫేస్బుక్లను ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ సంస్థకు చురకలు అంటించింది. మీది 2-3 లక్షల కోట్ల డాలర్ల కంపెనీ కావచ్చు.. కానీ ప్రజల ప్రైవసీ అనేది వాళ్లకు అత్యంత విలువైనది. దానిని రక్షించే విధి మాది అని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇండియాలో వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీని అమలు చేయకుండా ఆదేశించాలని ఆ పిటిషన్ కోరింది. యురోపియన్ యూనియన్లో అమలు చేస్తున్న పాలసీనే ఇక్కడా అమలు చేయాల్సిందిగా కూడా ఆ పిటిషన్ అభ్యర్థించింది.













