ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోం : సుప్రీంకోర్టు
మగవారి వివాహ వయసు 21 అయినప్పుడు, ఆడవారి వివాహ వయసును కూడా 21 సంవత్సరాలుగా ప్రకటించాలని, ఆ మేరకు చట్ట సవరణ ఆదేశాలు ఇవ్వాలని ప్రముఖ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధీవాలా బెంచ్ విచారణ చేపట్టింది. స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసు అంశం పార్లమెంటు పరిధిలోకి వస్తుందని, దీంట్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. రాజ్యాంగానికి కేవలం సుప్రీంకోర్టు ఒక్కటే రక్షణ కల్పించదని పేర్కొంది. పార్లమెంటు వంటి పలు వ్యవస్థలు కూడా రాజ్యాంగ పరిరక్షణలో పాలుపంచుకుంటున్నాయని వివరించింది. కనీస వివాహ వయసు చట్ట సవరణ చేయాలని పిటిషనర్ కోరుతున్నారని, దానిపై తాము పార్లమెంటుకు ఆదేశాలు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్ట సవరణ చేస్తే మహిళలకంటూ ఓ వివాహ వయసు లేకుండా పోతుందని అభిప్రాయపడింది.













