అంబేడ్కర్, భగత్‌సింగ్‌లకు అవమానం: సునీతా కేజ్రీవాల్ వీడియోపై బీజేపీ ఆగ్రహం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఈ వీడియోలో ఆమె వెనకున్న కేజ్రీవాల్ ఫోటోపై బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలోనే జైలు నుంచే ఢిల్లీ పరిపాలనకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారని, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల కోసం వినతి పత్రాలు పంపిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతున్న విషయం తెలిసిందే. అలాగే ఈ వినతి పత్రాలను కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ వీడియో ద్వారా చదివి వినిపిస్తూ వస్తున్నారు.
కాగా.. ఇన్నాళ్ల నుంచి సునీతా కేజ్రీవాల్ విడుదల చేసిన వీడియో సందేశాల్లో ఆమె వెనుక ఉన్న గోడపై రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్, వీర్ భగత్ సింగ్ ఫొటోలు మాత్రమే కనిపించేవి. అయితే తాజా వీడియోలో వారి ఫోటోల మధ్యలో జైలు ఊచల వెనక నిలబడినట్లున్న కేజ్రీవాల్ ఫొటో కూడా దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫోటోపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. దీనిపై ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్.. ‘‘అవినీతిపరుడైన కేజ్రీవాల్ ఫొటోను వారిద్దరి మధ్య పెట్టడం బాధాకరం. గతంలో కెమెరా ముందు కేజ్రీవాల్ అబద్ధాలు చెప్పేవారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉండి తన భార్య ద్వారా అబద్ధాలు చెప్పిస్తున్నారు’’ అంటూ విమర్శించారు. ఇలాంటి ఎత్తుల ద్వారా ప్రజలు మోసపోరని, ఇది అంబేడ్కర్, భగత్సింగ్లను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఇక బీజేపీకి చెందిన మరో నేత కపిల్ మిశ్రా దీనిని క్షమించరాని చర్యగా అభివర్ణించారు.













