బిసిసిఐ తీరును తప్పపట్టిన గవాస్కర్
బీసీసీఐ తీరును టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా తప్పుపట్టారు. బీసీసీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క ప్రస్తుతం గర్భిణి. ఆమె జనవరి మొదటివారంలో బిడ్డకు జన్మనివ్వబోతున్నది. ఈ క్రమంలో బీసీసీఐ విరాట్ కోహ్లీకి పితృత్వ సెలవులు మంజూరు చేసింది. అతడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సీరిస్‌ను వదిలేసి ఇండియాకు పయనమయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి.. ప్రస్తుతం టీంఇండియాకు ఎంపికైన నటరాజన్ భార్య కూడా నటరాజన్ ఐపీఎల్ లో ఆడుతున్నప్పుడే ప్రసవించింది. అతడికి అమ్మాయి పుట్టింది. అయితే ఆ టైంలో నటరాజన్ కు బీసీసీఐ సెలవు మంజూరు చేయలేదు. మరోవైపు అతడిని యూఏఈ నుంచి ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేసి.. ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కించారు. అయితే ఇప్పటివరకు నటరాజన్ తన పాపను చూసుకోలేదు.
ఈ క్రమంలో గవాస్కర్ బీసీసీఐపై మండిపడ్డారు. బీసీసీఐ నటరాజన్‌కు ఓ న్యాయం.. విరాట్ కోహ్లీకి మరో న్యాయం చేసిందని ఆయన ఫైర్ అయ్యారు. యువ బౌలర్ టీ నటరాజన్ భార్య పాపకు జన్మనిచ్చినా.. అతడికి ఎందుకు సెలవులు ఇవ్వలేదంటూ గవాస్కర్ పేర్కొన్నారు. ఒకే టీమ్‌లో ఉన్న కోహ్లీ నటరాజన్‌ను వేర్వేరుగా చూడటం టీమిండియా మేనేజ్మెంట్ కే చెల్లిందని సునీల్ గవాస్కర్ సెటైర్లు వేస్తూ బిసిసిఐ తీరు సరిగా లేదని విమర్శించారు.













