మీరు ఆ పార్టీలో ఉంటూ.. ఆప్ కోసం పనిచేయండి
కాషాయ పార్టీలో ఉంటూనే బీజేపీ కార్యకర్తలు ఆప్ కోసం పని చేయాలని ఆప్ చీఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో పర్యటనలో కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాము అధికారం లోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, దీంతో బీజేపీ కార్యకర్తలు లబ్ది పొందుతారని అన్నారు. తమకు బీజేపీ నేతలు అవసరం లేదని, ఆ పార్టీ పన్నా ప్రముఖులు, గ్రామాలు, బూత్లు తాలూకా స్థాయి కార్యకర్తలు తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. బీజేపీకి ఏండ్లుగా సేవలందిస్తున్న కార్యకర్తలకు ఆ పార్టీ తిరిగి ఏమిచ్చిందని ప్రశ్నించారు.
మీరు (బీజేపీ కార్యకర్తలు) ఆ పార్టీలోనే ఉండండి. అయితే ఆప్ కోసం పనిచేయండని కాషాయ పార్టీ కార్యకర్తలకు సూచించారు. బీజేపీ ఇచ్చే డబ్బు తీసుకుని తమ కోసం పనిచేయాలని. తమ పార్టీ వద్ద డబ్బు లేదని అన్నారు. గుజరాత్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం, ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. బీజేపీ తమ కార్యకర్తలు, వారి కుటుంబాలకు ఈ సదుపాయాలు కల్పించడం లేదని తాము వారందరికీ వీటన్నింటిని అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.













