అపాయింట్మెంట్ ఇవ్వకుండా.. నేరుగా ఖర్గే ఇంటికెళ్లి అభినందించిన సోనియా.. కారణం అదేనా?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో వెటరన్ నేత మల్లికార్జున ఖర్గే భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వయంగా ఆయన ఇంటికి వెళ్లిన ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ఖర్గేను అభినందించడం సంచలనంగా మారింది. అంతకుముందు ఎన్నికల్లో గెలిచిన ఖర్గే.. సోనియాను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరగా ఆమె నిరాకరించారు. ఆ తర్వాత కాసేపటికే ఆయన ఇంటికి వెళ్లి కలవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఇంటికి తప్ప మరే ఇతర కాంగ్రెస్ నేత ఇంటికి సోనియా గాంధీ వెళ్లలేదు. అలాంటిది ఆమె ఇలా స్వయంగా ఖర్గే నివాసానికి వెళ్లడంతో పార్టీ నేతలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే అని, అందరూ ఆయన మాట వినాల్సిందే అనే సందేశం ఇవ్వడం కోసమే సోనియా ఇలా చేశారని సమాచారం.













