‘‘మోదీ సాబ్… మాకు ఇంత కష్టమా?’’ ఆరేళ్ల చిన్నారి వీడియో వైరల్

దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో పాఠశాలలకు తాళాలు పడ్డాయి. పిల్లలందరికీ ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ‘‘హమ్మయ్య… హాయిగా ఇంటివద్ద నుంచే క్లాసులు వినొచ్చు’’ అని పిల్లలు తెగ సంబరపడిపోయారు. కానీ రానూ రానూ… ఈ ఆన్‌లైన్ క్లాసులతో పిల్లలు విసుగెత్తి పోతున్నారని అర్థమవుతోంది. దానికి బదులు నేరుగా పాఠశాలలకు వెళ్తేనే బాగుంటుందేమో? అన్న అభిప్రాయానికి పిల్లలు వచ్చేశారు. ఆన్‌లైన్ క్లాసులతో పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోతోంది. అచ్చు ఇదే విషయాన్ని జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఓ ఆరేళ్ల బాలిక ఆన్‌లైన్ క్లాసులపై ఏకంగా ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్లింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ చిన్నారి మాటలకు అందరూ ఫిదా అవుతున్నారు.
‘‘నమస్కారం మోదీ సాబ్… నాకు ఆరేళ్ల వయస్సు. ఆన్‌లైన్ క్లాసుల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. చిన్న చిన్న పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులంటూ హోంవర్కులకు తెగ ఇచ్చేస్తున్నారు. ఎందుకుంత హోంవర్కులు ఇస్తున్నారు? చిన్న పిల్లలం… ఎలా చేస్తాం? ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకూ తరగతులు జరుగుతాయి. ఇంగ్లీష్, గణితం, కంప్యూటర్… ఇలా అన్నీ చెబుతున్నారు. పని విపరీతంగా పెరిగిపోయింది. మాకు అంత కష్టం అవసరమా మోదీ సాబ్? ఏం చేద్దామంటారు… కాస్త చెప్పండి’’ అంటూ ఆరేళ్ల పాప ఆ వీడియోలో మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.