కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఇంట తీవ్ర విషాదం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో తమ ప్రభుత్వమే వస్తుందనే సంతోషంతో ఆ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే మాజీ సీఎం సిద్ధరామయ్య మళ్లీ సీఎం కుర్చీలో కూర్చునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆయన కుటుంబం మరింత సంతోషంగా ఉంది. ఇలాంటి సమయంలో ఆ ఇంట విషాదం చోటుచేసుకుంది. సిద్దరామయ్య బావగారు నేడు కన్నుమూశారు. ఆయన సోదరి శివమ్మ భర్త రామే గౌడ (69) ఆకస్మికంగా కన్నుమూశారు. రామే గౌడ ఈ ఉదయం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను నగరంలోని జేఎస్ఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే ఉదయం 8.30 గంటల సమయంలో రామే గౌడ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రామేగౌడకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం హత్తూరులో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.













