మేం పోటీ చేయం… బెంగాల్ ‘శివంగి’ కే మా మద్దతు : శివసేన
బెంగాల్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని శివసేన ప్రకటించింది. మొదట్లో మాత్రం తాము బరిలోకి దిగుతామని ప్రకటించిన శివసేన… అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే తాము సీఎం మమతా బెనర్జీకి మాత్రం మద్దతిస్తామని స్పష్టం చేశారు. బెంగాల్‌కు నిజమైన శివంగి బెనర్జీయే అని సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘‘బెంగాల్ దీదీ వర్సెస్ ఇతరులు అన్నంతలా రాజకీయాలు మారాయి. మమత ఒక్కరే ఒక దిక్కు. అన్ని వ్యవస్థలూ మమతకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అందుకే ఆమెకు మద్దతుగా నిలబడాలని పార్టీ అధినేత తలపోశారు. బ్రహ్మాండమైన మెజారిటీతో ఆమె తిరిగి విజయం సాధించాలని మేం కోరుకుంటున్నాం. బెంగాల్‌కు నిజమైన శివంగి బెనర్జీయే’’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
ఆర్జేడీ, ఎస్పీ మద్దతు కూడా మమతకే…
మమతకు ఒక్కొక్కరి మద్దతు పెరుగుతూ వస్తోంది. మొదట ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ మమతతో భేటీ అయ్యారు. తమ పూర్తి మద్దతు మమతా బెనర్జీకే ఉంటుందని తేజస్వీ ప్రకటించారు. అయితే మొదట్లో హిందీ ప్రాంతం వారు అధికంగా ఉండే ప్రాంతాల్లో పోటీకి దిగాలని ఆర్జేడీ నిశ్చయించుకుంది. కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని తృణమూల్‌కు మద్దతివ్వాలని అనుకుంది. వామపక్షాలతో, కాంగ్రెస్‌తో తమ పొత్తు కేవలం బిహార్ వరకేనని, బెంగాల్లో మాత్రం తృణమూల్‌ను అధికారంలోకి తేవడమే తమ ధ్యేయమని తేజస్వీ ప్రకటించారు.
ఇక సమాజ్‌వాదీ కూడా సీఎం మమతా బెనర్జీకే జై కొట్టింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. తమ మద్దతు మమతాకేనని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. ఈ బాధ్యతను మాజీ మంత్రి కిరణ్మయి నంద చూసుకుంటురాని అఖిల్ ప్రకటించారు. తృణమూల్‌కు మద్దతుగా ప్రచారం కూడా చేస్తామని అఖిలేశ్ తెలిపారు. అయితే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బెంగాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సీఎం యోగి విష ప్రచారం చేస్తూ పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలను గందరగోంలో పడేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఉచ్చులో ప్రజలెవ్వరూ చిక్కుకోవద్దని అఖిలేష్ విజ్ఞప్తి చేశారు.













