నేటి నుంచి సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
సుప్రీంకోర్టు విచారణలను నేటి నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అత్యున్నత న్యాయస్థానంలోని రాజ్యాంగ ధర్మాసనాల్లో జరిగే విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ లైవ్ ప్రొసీడింగ్స్ ప్రస్తుతానికి యూట్యూబ్లో ప్రసారం అవుతాయి. భవిష్యత్తులో వీటిని సుప్రీంకోర్టు సొంత వేదిక ద్వారానే ప్రసారం చేస్తారు. సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే నిర్ణయాన్ని 2018లోనే తీసుకున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేసిన ఆగస్టు 26న తొలిసారిగా సుప్రీం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. కాగా, ప్రస్తుతానికి కేవలం రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసులను మాత్రమే లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. త్వరలోనే మిగతా ధర్మాసనాల విచారణలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.













