ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం… ఆకస్మాత్తుగా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటనలో భద్రతా వైపల్యం చోటుచేసుకుంది. హుబ్బళిలో రోడ్ షో కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీ కారు ఫుట్‌బోర్డుపై నిలబడి రోడ్డుకు ఇరువైపులా జనాలకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. ఇంతలో మోదీ కాన్వయ్ వద్దకు ఓ యువకుడు ఆకస్మాత్తుగా దూసుకొచ్చాడు. జనాల మధ్య నుంచి పరుగెత్తుకొచ్చిన వ్యక్తి సెక్యూరిటీ బారికేడ్‌ను దాటుకొని ప్రధానికి పూలదండ వేసేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బందిని తోసుకుంటూ రావడంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అప్రమత్తమైంది. మోదీకి అత్యంత సమీపానికి వచ్చిన యువకుడిని చివరి నిమిషంలో అడ్డుకొని వెనక్కి లాగేశారు. అనంతరం ప్రధాని యథావిధిగా రోడ్డు షో కొనసాగించారు.













