డీఎంకే అధ్యక్షుడిగా రెండోసారి స్టాలిన్ ఎన్నిక ఏకగ్రీవం
తమిళనాట అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి సీఎం ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యారు. ఆదివారం నాడు చెన్నైలో పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ను కొనసాగించాలని పార్టీ నేతలు ఏకపక్షంగా తీర్మానించారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా దురై మురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. వీరు ముగ్గురూ ఇలా ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య కార్యదర్శిగా కేఎన్ నెహ్రూను నియమించడం జరిగింది. గతంలో డీఎంకే మహిళా విభాగానికి నేతృత్వం వహించిన కనిమొళి కరుణానిధిని ప్రస్తుతం డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీని చేశారు. పెరియసామి, కే పొన్ముడి, ఏ రాజా, అంతియూర్ సెల్వరాజ్లతో పాటు కనిమొళిని కూడా డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.













