కేంద్ర మంత్రి గడ్కరీ కీలక నిర్ణయం… త్వరలోనే ఆదేశాలు
కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై కారులో ప్రయాణించే వారందరికీ సీటు బెల్టు ధరించడం తప్పనిసరి చేస్తామన్నారు. సెప్టెంబర్ 4న జరిగిన కారు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందడమే ఈ నిర్ణయానికి కారణమని గడ్కరీ తెలిపారు. ఈ సందర్భంగా గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ సైరస్ మిస్త్రీ మరణం, కారులో వెనుక సీటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని అన్నారు. కేంద్రమంత్రి వెనుకసీటులో కూర్చున్న వారికి కూడా సీటు బెల్ట్ తప్పని సరిగి ధరించాలని వ్యాఖ్యానించారు. త్వరలోనే వెనుకసీట్లో కూర్చున్న వారితో సహా కారులో ప్రయాణించే అందరూ సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి చేస్తామని తెలిపారు. సీటుబెల్ట్ ధరించకుంటే సీట్‌బెల్ట్ బీప్ సిస్టమ్ కూడా అమలులో ఉంటుందని తెలిపారు. అంతేకాదు ఈ నిబంధన పాటించక పోతే జరిమానా కూడా విధించే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఆదేశాలను మూడు రోజుల్లో జారీ చేస్తామని పేర్కొన్నారు.













