శశికళ బినామీల రూ.300కోట్ల ఆస్తుల జప్తు…
నిన్నటి పురుచ్చతళైవి ఆప్తమిత్రురాలు, తమిళనాడుకు చెందిన కీలక రాజకీయ నేత శశికళ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో అరెస్టయి జైలులో కారాగార జీవితం గడుపుతున్న శశికళకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు అనూహ్యంగా గట్టి సాక్ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన పలు ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడులోని పలు చోట్ల ఉన్న శశికళకు చెందిన 65 బినామీ ఆస్తులు ఇందులో ఉన్నాయి. వీటిలో పోయెస్ గార్డెన్లోని మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత నివాసమైన వేద నిలయం ఎదురుగా ఉన్న భూమి కూడా ఉంది. వీటి విలువ షుమారుగా రూ.300 కోట్ల వరకూ ఉంటుందని అచంనా.
ఈ ఆస్తులు శశికళ బంధువులే డైరెక్టర్లుగా కలిగిన శ్రీ హరి చందన ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందినవిగా సమాచారం. అయితే సదరు కంపెనీ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు చేయడం లేదని, నగదు లభ్యత కూడా ఏమీ లేదని అధికారులు అంటున్నారు. ఇవన్నీ 2003 నుంచి రెండేళ్ల వ్యవధిలో కొన్నవిగా గుర్తించారు. వేదనిలయం ఎదురుగా ఉన్న స్థలంలో ఒక భవన నిర్మాణం జరుగుతోంది. తాను జైలు నుంచి విడుదలయ్యాక అందులోనే నివాసం ఉండాలని శశికళ భావిస్తున్నారట. ఈ పరిస్థితుల్లో బినామీ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ ఆస్తులను జప్తు చేయడంతో శశికళకు కోలుకోలేని దెబ్బ తగిలినట్టే.













