‘బానిసత్వం వద్దనుకొని జైల్లో ఉన్నా’.. జైలు నుంచి తల్లికి లేఖ రాసిన సంజయ్ రౌత్
పత్రచాల్ కుంభకోణంలో ఇరుక్కొని జైల్లో ఉన్న శివసేన నేత సంజయ్ రౌత్.. తన తల్లికి ఒక లేఖ రాశారు. దానిలో బానిసత్వం కంటే జైలు జీవితమే ఉత్తమంగా ఉన్నదని ఆయన అన్నారు. నాలుగు పేజీలు ఉన్న ఈ లేఖలో ఈడీ దాడి మొదలుకొని ప్రభుత్వాన్ని పడగొట్టడం అన్ని విషయాలనూ ప్రస్తావించారు. ‘శివసేనను కాపాడేందుకు పోరాడాలి. నేను బానిస జీవితాన్ని గడపలేను. అందుకే జైలు జీవితాన్ని స్వీకరించా’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సంజయ్‌రౌత్ తల్లి మీడియాకు అందించారు. కచ్చితంగా తను తిరిగొస్తానని ఆయన తన లేఖలో తల్లికి మాటిచ్చారు. మహారాష్ట్ర, దేశం ఆత్మలను అంత సులభంగా ఎవరూ నాశనం చేయలేరని ఆయన చెప్పారు. ‘నువ్వేం దిగులు పడకు. ఉద్ధవ్ థాకరే, శివసైనికులు నిన్ను బాగా చూసుకుంటారు’ అని తల్లికి ధైర్యం చెప్పారు.













