గడ్కరీ సవాల్ ను స్వీకరించిన బీజేపీ ఎంపీ…
కిలో బరువు తగ్గితే వెయ్యి కోట్ల చొప్పున నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఊబకాయమున్న బీజేపీ ఎంపీకి ఈ మేరకు సవాల్ విసిరారు. దీంతో దీనిని సీరియస్‌గా తీసుకున్న ఆయన తన ఊబకాయాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించారు. నిత్యం వ్యాయామాలు చేస్తూ ఆరు కేజీల బరువు తగ్గారు. దీంతో రూ.6,000 కోట్ల నిధుల కోసం నితిన్ గడ్కరీని కలువనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలో రూ.5,722 కోట్ల విలువైన 11 రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ కింద 543 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా మకోడియామ్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడారు. తన నియోజకర్గం అభివృద్ధి కోసం నిధులు కోరుతున్న ఉజ్జయినీ బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియాకు ఒక సవాల్ విసిరారు. నేను 135 కేజీల నుంచి 93 కేజీలకు తగ్గాను. ఇప్పుడు నీకు ఒక షరతు పెడుతున్నా. నవ్వు కిలో చొప్పున బరువు తగ్గితే, ఉజ్జయినీ అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తా. నవ్వు బరువు తగ్గు. ఎలా తగ్గాలో కూడా నేను చెబుతా అని అన్నారు. గడ్కరీ ఆఫర్‌ను సవాల్‌గా తీసుకుని 125 కేజీల బరువున్న బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా ప్రస్తుతం ఆరు కేజీలు తగ్గారు. దీంతో నితిన్ గడ్కరీ హామీని ఆయన గుర్తు చేశారు.తన నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.6,000 కోట్ల నిధులు సాధించినట్లు తెలిపారు.













