దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలో దేశంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ను ముంబయిలో 18.5 ఎకరాలలో విస్తరించిన జియో వరల్డ్ సెంటర్లో ప్రారంభించింది. ఇందులో 1.61 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో మూడు ఎగ్బిబిషన్ హాళ్లు, 1.07 లక్షల చదరపు అడుగలు విస్తీర్ణంలో కలిగిన రెండు కన్వెన్షన్ హాళ్లు ఉన్నాయి. ఈ కన్వెన్షన్ కేంద్రం 5జీ నెట్వర్క్తో అనుసంధానమై ఉంటుందని రిలయన్స్ వెల్లడించింది. ముంబయి నగరానికి ధీరూభాయ్ అంబానీ స్క్వేర్, ఫౌంటెయిన్ ఆఫ్ జాయ్లను అంకితం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫౌంటెయిన్లో 8 ఫైర్ షూటర్లు, 392 వాటర్ జెట్లు, 600కు పైగా ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. ఈ కన్వెన్షన్ కేంద్రంలోని వంటశాల ద్వారా రోజుకు 18,000 మందికి పైగా ఆహారం అందించేందుకు సౌలభ్యం ఉంది. ఈ ఏడాది వచ్చే ఏడాది దశల వారిగీ ఇందులోని వివిధ విభాగాలను సంస్థ ఆవిష్కరించనుంది. నవ భారత ఆకాంక్ష లకు ప్రతిరూపంగా జియో వరల్డ్ సెంటర్ ఉంటుందని డైరెక్టర్, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ నీతా అంబానీ తెలిపారు.













