శ్రీ రామనవమి వేడుకల్లో విషాదం
మధ్యప్రదేశ్ లో శ్రీరామనవమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలి అందులో భక్తులు పడిపోయారు. ఇందౌర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. పటేల్ నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి పైనున్న ఫ్లోరింగ్‌పై కూర్చుకున్నారు. అయితే బరువు ఆపలేక ఆ ప్రాంతం ఒక్కసారిగా కుంగిపోయి ప్లోరింగ్ కూలిపోయింది. దీంతో దాదాపు 30 మంది భక్తులు అందులో పడిపోయారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. నిచ్చెన సాయంతో కొందరు భక్తులను బయటకు తీసుకొచ్చారు.
ఈ ఘటనలో 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇందౌర్ పోలీసులు వెల్లడించారు. మరో 17 మందిని రక్షించారు. వారికి గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బావి లోతు 50 అడుగుల పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, సహాయచర్యలు కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు.













