రాజ్యసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా
రాజ్యసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం అక్టోబరు 1వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగాల్సి ఉన్నప్పటికీ 8 రోజులు ముందుగానే ముగించారు. సభ్యుల్లో కొందరికి కరోనా వైరస్ సోకడంతో సభా సమావేశాల్ని కుదిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాజ్యసభలో పలు కీలక బిల్లులను ఆమోదించారు. జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లుతో పాటు మూడు కార్మిక బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ మూడు కార్మిక బిల్లులలో ద ఆక్యుపేషనల్ సేప్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020, ద ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 బిల్లులు ఉన్నాయి.
ఈ నెల 14న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశాలు 18 రోజులపాటు జరగాల్సి ఉన్నప్పటికీ 10 రోజులే జరిగాయని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. ఈ పది రోజుల సమావవేశాల సందర్భంగా రాజ్యసభలో 25 బిల్లులు ఆమోదం లభించగా, ఆరు బిల్లులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ సమావేశాల ఉత్పాదకత 100.47 శాతం ఉందని తెలిపారు. 198 మంది ఎంపీలు రాజ్యసభలో చర్చల్లో పాల్గొన్నారని, 1567 అన్స్టార్డ్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు వెంకయ్య నాయుడు వెల్లడించారు.













