చైనాకు వార్నింగ్ ఇచ్చిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను మారుస్తూ చైనా ఇటీవల విడుదల చేసిన ప్రకటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ఒకవేళ భారత్ కూడా చైనా విషయంలో ఇలానే చేస్తే అక్కడి భూభాగాలు భారత్‌వి అయిపోతాయా? అంటూ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అరుణాచల్‌లోని నంసాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. భారత దేశ గౌరవం దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకునేది లేదని చైనాను హెచ్చరించారు. అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లోని అంతర్భాగమని, చైనా కుయుక్తులు పన్నినంత మాత్రాన వాస్తవాలు మారవని హెచ్చరించారు.
“అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాల పేర్లను మార్చిన చైనా.. తన వెబ్సైట్లో పోస్ట్ చేసింది. అయితే చైనాకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. పేర్లు మార్చినంత మాత్రాన ఏం జరగదు. ఒకవేళ మేం కూడా చైనాలోని కొన్ని ప్రావిన్సులు, ప్రాంతాల పేర్లను మార్చి భారత్‌లో భాగాలుగా చూపిస్తే అవి మనవి అయిపోతాయా..?’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రశ్నించారు. “జీవితంలో స్నేహితులు మారతారు కానీ పొరుగువారు మారరని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పేవారు. అందుకే భారతదేశం కూడా పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనే అనుకుంటుంది. అయితే ఎవరైనా భారతదేశ గౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఏ మాత్రం సహించేది లేదు. అందుకు తగిన సమాధానం చెప్పే శక్తి నేటి భారతదేశానికి ఉంది” అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.













