ఎన్నికల బరిలో ప్రభుత్వ వైద్యుడు.. ఓడిపోతే తిరిగి ఉద్యోగంలోకి
ఒక ప్రభుత్వ వైద్యుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాడు. దీని కోసం హైకోర్టుకు ఆశ్రయించాడు. ఎన్నికల్లో పోటీకి అనుమతించిన కోర్టు, ఒకవేళ అతడు ఓడిపోతే తిరిగి వైద్య విధుల్లో కొనసాగనివ్వాలని ప్రభుత్వం, వైద్య విభాగాన్ని ఆదేశించింది. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. 43 ఏళ్ల దీపక్ ఘోగ్రా దుంగార్పూర్ జిల్లా అసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. భారతీయ గిరిజన పార్టీ (బీటీపీ) రాష్ట్ర అధ్యక్షుడు వేలారామ్ ఘోగ్రా కుమారుడైన ఆయన రాజకీయాల్లోకి రావాలని భావించాడు. గత పదేళ్లుగా జిల్లా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న గిరిజన డాక్టర్ దీపక్ ఘోగ్రా ఈ నెల 25 జరుగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాడు. దీనికి అనుమతి కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన జోధ్‌పూర్ బెంచ్ సానుకూలంగా స్పందించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పిటిషనర్‌ను మెడికల్ ఆఫీసర్ పదవి నుంచి రిలీవ్ చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. అలాగే పిటిషనర్ ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే, తిరిగి మెడికల్ ఆఫీసర్ పదవిలో చేరడానికి అనుమతించాలని కోర్టు పేర్కొంది. జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భాటీ నేతృత్వంలోని ధర్మాసనం అక్టోబర్ 20న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.













