రైల్వేశాఖ కీలక నిర్ణయం. . బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్
హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 8 కారిడార్లలో బుల్లెట్ రైళ్లు నడిపేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో తొలివిడతగా ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు నడపాలని, అందుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేసింది. భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీంతో పాటు ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-అహ్మదాబాద్, ముంబై-నాగ్పూర్, ముంబై- హైదరాబాద్, చెన్నై- మైసూర్, ఢిల్లీ-అమృత్సర్, వారణాసి-హౌరా మార్గాల్లో బుల్లెట్ రైళ్ల కోసం డీపీఆర్లు సిద్ధం చేసే పనిలో రైల్వే అధికారులు బిజీబిజీగా ఉన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాజాగా హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు నడపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి డీపీఆర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. నాగ్పూర్-వారణాసి, పాట్నా- గువహటి, అమృత్సర్-జమ్మూ మార్గాల్లోనూ బుల్లెట్ రైళ్ల ఏర్పాటుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.













