అధికారిక భవనాన్ని ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అధికారిక బంగళాను ఖాళీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక వర్గానికి పరువునష్టం కలిగించే విధంగా రాహుల్ వ్యాఖ్యలు చేశారని కేసు దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది. అనంతరం ఆయన పార్లమెంట్ సభ్యత్వం కూడా రద్దయింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లోని 12వ నెంబర్ బంగళాలోని ఆయన వస్తువులన్నింటికీ ఒక ట్రక్‌లో తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2004లో లోక్‌సభ సభ్యుడిగా గెలిచినప్పుడు రాహుల్ గాంధీకి ఈ బంగళా కేటాయించారు. అప్పటి నుంచి రాహుల్ అధికారిక నివాసంగా ఈ బంగళా మారింది. అయితే మోదీ కమ్యూనిటీపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసినట్టు 2019లో ఆయనపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో ఆయనను దోషిగా సూరత్ కోర్టు తేల్చింది. ఈ నేపథ్యంలో నిబంధనలను అనుసరించి రాహుల్ మార్చి 23 నుంచి ఆటోమేటిక్‌గా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఇదే విషయాన్ని లోక్‌సభ సెక్రెటరీ కూడా ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ క్రమంలోనే రాహుల్ తన బంగళాను ఖాళీ చేశారు.













