2 రూపాయలు కూడా లేకుండా చేశారు: రాహుల్ గాంధీ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు గురువారం ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కావాలనే తమ పార్టీని టార్గెట్ చేసి దెబ్బతీస్తోందన్నారు. లోక్సభ ఎన్నికల వేళ తమ దగ్గర డబ్బులు లేకుండా చేసేందుకే పార్టీ అకౌంట్లు ఫ్రీజ్ చేశారని, ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన డబ్బులు కూడా అందకుండా చేశారని అన్నారు. డబ్బులు లేకపోవడం వల్ల తమ నేతలను ఎక్కడికీ పంపలేకపోతున్నామని, కనీసం రైలు టికెట్లు కొనడానికి కూడా డబ్బులు లేవని, ప్రకటనలు కూడా ఇవ్వలేకపోతున్నామని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ పార్టీని దెబ్బతీసేందుకే ప్రధాని మోదీ ఇలాంటి తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
‘‘మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నికల సమయంలో ప్రచారాల కోసం ప్రకటనలు కూడా ఇవ్వలేకపోతున్నాం. పార్టీ నేతలను ఎక్కడికైనా పంపించాలన్నా సాధ్యం కావడం లేదు. ఫ్లైట్లలో వెళ్లడం కాదు.. కనీసం రైలు టికెట్లు కూడా కొనడానికీ మా దగ్గర డబ్బుల్లేని దుస్థితిలో ఉన్నాం. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై కావాలనే ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారు.’’ అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
అంతేకాకుండా తమకు దేశంలో 20శాతం ఓటర్లు మద్దతిస్తున్నారని, కానీ కనీసం 2 రూపాయలు కూడా చెల్లించలేకపోతున్నామని వాపోయారు. ఎన్నికల్లో పోరాడకుండా తమ సామర్థ్యాన్ని కావాలనే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, దీన్ని బట్టి చూస్తే దేశంలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయిందని, అదో అబద్ధంగా మిగిలిపోయిందని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయడం అనేది కేవలం తమ పార్టీపై జరుగుతున్న దాడి కాదని, మొత్తం భారత ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.













