బీజేపీయే నాకు గురువు.. ఏం చేయకూడదో నేర్పింది
భారతీ జనతా పార్టీపైన, ఆ పార్టీ నేతలపై మరోసారి కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను ప్రారంభించినప్పుడు ఒక సాధారణ పాదయాత్ర లాగే భావించానని, అయితే అడుగడుగున బీజేపీ తమ యాత్రను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల విమర్శలతో భారత్ జోడో యాత్రకు భారీగా ప్రచారం జరిగిందని అన్నారు. అందుకు బీజేపీ నేతలకు తాను కృతజ్ఞతలు చెబుతున్నానని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ఇకపై కూడా తమను బాగా విమర్శించాలని కోరుకుంటున్నాని, దాంతో కాంగ్రెస్ పార్టీకి వారి భావజాలాన్ని అర్థం చేసుకునే అవకాశం దక్కుతుందని అన్నారు. నాయకులు ఏం చేయకూడదనేది వాళ్లు (బీజేపీ నేతలు) నాకు చేసి చూపిస్తున్నారని, అందుకే వారిని తన గురువులుగా భావిస్తున్నానని రాహుల్ వ్యాఖ్యానించారు.













