రాహుల్ గాంధీ వ్యాపార సంబంధాలపై ఆజాద్ షాకింగ్ కామెంట్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు అవాంఛనీయ వ్యాపారవేత్తలతో రాహుల్ గాంధీకి సంబంధాలు ఉన్నాయని షాకింగ్ ఆరోపణలు చేశారు. “ఈ అవాంఛనీయ వ్యాపారవేత్తలతో రాహుల్ కుటుంబం మొత్తానికి సంబంధాలు ఉన్నాయి. రాహుల్ విదేశాలకు వెళ్లినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తాడో, ఎవరిని కలుస్తాడో కనీసం 10 ఉదాహరణలు ఇవ్వగలను” అని గులాం నబీ ఆజాద్ వెల్లడించారు.
ఓ మలయాళ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆజాద్ ఈ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కొంతకాలం క్రితం పార్టీని వీడిన ఆజాద్‌కు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీతో సంబంధాలు ఉన్నాయంటూ రాహుల్ ఒక ట్వీట్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గులాం నబీ ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్‌లో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఆ పార్టీ అంతరించిపోయిందని అయితే, కొందరు నేతలు మాత్రం ఆ పార్టీలో మిగిలి ఉన్నారని ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ సహా ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం ఏమాత్రం పార్టీపై ప్రభావం చూపలేకపోతోందని విమర్శించారు.
“రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేయడంతో ఆయన ఛరిష్మా పెరిగిందని చాలామంది అంటున్నారు. నాకు తెలిసి అలాంటిదేం జరగలేదు. రాహుల్‌కు అంతగా ప్రజాదరణ పెరగలేదు. ఇటీవల సూరత్ కోర్టుకు రాహుల్ వెళ్లారు కదా.. అక్కడ ఒక్క గుజరాతీ యువకుడు కానీ, గుజరాతీ రైతు కానీ రాహుల్‌ను కలిశారా?” అని ఆజాద్ సూటిగా ప్రశ్నించారు. మరో సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా ఆజాద్ స్పందించారు. అనిల్ ఇలా కాంగ్రెస్‌కు వీడ్కోలు పలకడం చాలా దురదృష్టకరం అని అన్నారు. ‘‘కాంగ్రెస్‌లో చాలా మంది 50 ఏళ్ల లోపు వయసున్న నేతలు.. పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. వాళ్లు ఇలా వెళ్లిపోవడానికి కారణం రాహుల్‌లో నాయకత్వ లక్షణాలు, దార్శనికత లేకపోవడమే’’ అని ఆజాద్ స్పష్టం చేశారు.













