రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన లోక్ సభ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియెట్ ప్రకటించింది. పరువు నష్టం దావా కేసులో నిన్న (గురువారం) ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ల ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియెట్ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా నెగ్గారు. తాజా నిర్ణయంతో ఆయన ఎంపీగా అర్హత కోల్పోయారు. తీర్పుపై అభ్యర్థన పిటిషన్‌కు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఈలోపే ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు లోక్‌సభ సెక్రటరీ జనరల్. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. త్వరలో జరగనున్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. రాహుల్ గాంధీని కావాలనే చిక్కుల్లో పడేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.













