ఆప్‌కు కీలక మంత్రి రాజీనామా.. ఎన్నికల ముందు గట్టి షాక్!
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు కీలక నేత, ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో ఆప్‌పై ఆయన సంచలన కామెంట్స్ కూడా చేశారు. ప్రజలకు సేవ చేయాలని, అవినీతిపై పోరాడాలనే బలమైన సంకల్పాన్ని చూసి, తాను ఆప్‌లో చేరానని, కానీ నేడు ఆ పార్టీనే అవినీతికి అడ్డాగా మారిపోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామాకు సంబంధించి బుధవారం మీడియా ముఖంగా ప్రకటన చేసిన రాజ్‌కుమార్ ఆనంద్.. మంత్రి పదవికే కాకుండా, కేబినెట్, పార్టీ పదవులన్నింటి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. “ఈ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం నాకు అసౌకర్యంగా మారింది, అవినీతి కార్యకలాపాల్లో నా పేరు ఉండడం నాకిష్టం లేదు. అందుకే పార్టీకి, ప్రభుత్వానికి రాజీనామా చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఆప్‌ని దళిత విరోధి పార్టీగా ఆనంద్ అభివర్ణించారు. పార్టీలో నాయకత్వ పదవుల నియామకాల విషయంలో వివక్ష చూపుతోందని ఆరోపించిన ఆయన.. రాజ్యసభలో 13 మంది ఆప్ ఎంపీలున్నా వారిలో ఒక్కరు కూడా దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, మహిళలు లేకపోవడం బాధ కలిగించిందన్నారు. దళితుల కోసం పని చేయలేనప్పుడు ఆ పార్టీలో ఉండటం వృథా అనిపించిందని, అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.













