వీసీ పోస్టులను రూ.40-50 కోట్లకు అమ్మేవాళ్లు.. పంజాబ్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు రాష్ట్రంలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవులను వేలం వేశారని, ఒక్కో పదవికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు వసూలు చేశారని ఆ రాష్ట్ర మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పంజాబ్ గవర్నర్‌గా ఉన్న బన్వారీలాల్ పురోహిత్.. శుక్రవారం నాడు ఓ మీడియా సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను తమిళనాడు గవర్నర్‌గా నాలుగేళ్లు ఉన్నా. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఒక్కో వీసీ పోస్ట్‌ను రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లకు అమ్ముకునేవారు” అని గవర్నర్ పురోహిత్ ఆరోపించారు. తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు తమిళనాడులో 27 మంది వీసీలను చట్టబద్ధంగా నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ నియామకాల నుంచి పంజాబ్ రాష్ట్రం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఉన్న డాక్టర్ సత్బీర్ సింగ్ గోసల్ నియామకం సరైంది కాదని, ఆయన్ను చట్టవిరుద్ధంగా వీసీగా నియమించారని పురోహిత్ ఆరోపణలు చేశారు. సత్బీర్ను పదవి నుంచి తొలగించాల్సిందిగా గతంలోనే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను తను కోరానని చెప్పారు. యూనివర్సిటీ కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యంపై సీఎం భగవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని చెప్పారు.













