పుదుచ్చేరిలో కుప్పకూలిన ప్రభుత్వం
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. శాసనసభలో తన మెజారిటి నిరూపించుకోవడంలో ముఖ్యమంత్రి నారాయణస్వామి విఫలమయ్యారు. సరైన సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే ముఖ్యమంత్రి సభ నుంచి వెళ్లిపోయారు. బలపరీక్ష కోసం పుదుచ్చేరి శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభమైన తర్వాత ముఖ్మమంత్రి నారాయణస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానంపై ఓటింగ్ జరగకముందే ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో విశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ వీపీ శివకొలుందు ప్రకటించారు. మరోవైపు ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసేందుకు శాసనసభ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు బయల్దేరారు. అక్కడి ఎల్జీ తమిళిసైని కలిసి తన రాజీనామా అందజేసినట్లు నారాయణస్వామి ప్రకటించారు.
ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు సహా 33 మంది సభ్యులున్న పుదుచ్చేరి శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల అనంతరం 26 మంది ఉన్నారు. నారాయణస్వామి ప్రభుత్వం గట్టెక్కాలంటే 14 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ అధికార కాంగ్రెస్ కూటమి బలం 12కి తగ్గింది. ఇందులో కాంగ్రెస్ నుంచి 10 (స్పీకర్‌తో కలిపి), డీఎంకే నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు విపక్ష పార్టీ అయిన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి బలం 14 (ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు)గా ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాతో పుదుచ్చేరి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.













