ఇలాగైతే దీపావళి చేసుకొనేదెలా? : ప్రియాంక
ధరల పెరుగుదల అంశంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రధాని మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీపావళి పండుగకు వారం రోజుల ముందు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే ప్రజలు దీపావళి ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ పరిస్థితిపై మోదీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఉల్లిపాయలు, చక్కెర, పప్పుల ధరల పెరుగుదలను ప్రస్తావిస్తూ ప్రియాంకా మండిపడ్డారు. దీపావళి వారం రోజులే ఉంది. కానీ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి ధరలు అకస్మాత్తుగా పెరగడం మొదలైంది. అదే సమయంలో భారతదేశం ఉల్లిని ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద దేశం. గతేడాది రైతు సోదరులు నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ గోదాముల్లోనే కుళ్లిపోయిందా? అని ప్రియాంక ప్రశ్నించారు. చక్కెరతో పాటు పప్పులు సైతం పౌరులకు అందుబాటులో లేకుండా పోయాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లేం తింటారు. మిగతా వాళ్లకు ఏం పెడతారు? ఈ దీపావళి పండుగను ప్రజలు ఎలా సంతోషంగా చేసుకోవాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు.













