PM Modi: త్వరలోనే మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ!
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. మధ్యప్రాచ్యం (Middle East). ఆఫ్రికా దేశాలతో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా.. డిసెంబర్ 15 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ (PM Modi) మొదట జోర్డాన్ వెళ్తారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 ఆహ్వానం మేరకు వెళ్తున్న మోదీ.. అక్కడి నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్-జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ భేటీకి ప్రాముఖ్యత సంతరించుకుంది. అనంతరం ప్రధాని ఇథియోపియాకు పయనం అవుతారు. అక్కడ ఆ దేశ ప్రధాని డాక్టర్ అబీయ్ అహ్మద్ అలీతో సమావేశమవుతారు. మోదీకి (PM Modi) ఇదే తొలి ఇథియోపియా పర్యటన కావడం విశేషం. చివరగా ఒమన్ చేరుకుని, సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్‌ను కలుస్తారు. భారత్-ఒమన్ మధ్య 70 ఏళ్ల మైత్రిని పురస్కరించుకుని ఇరువురు నేతలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఒమన్‌లో మోదీకి ఇది రెండో పర్యటన. ఈ విస్తృత పర్యటన ముగించుకుని ఆయన నేరుగా భారత్‌కు తిరిగి రానున్నారు.






