రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదానం
దేశ రాజధాని ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో 2022 సంవత్సరానికి గాను పలు రంగాల్లో అందించిన సేవలకు గాను పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ఇద్దరికి పద్మ విభూషణ్, ఎనిమిది మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. సాహిత్యం, విద్యారంగంలో చేసిన కృషికి రాధే శ్యామ్ ఖేమ్కా దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (మరణానంతరం) పద్మ విభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డులను రాధే శ్యామ్ ఖేమ్కా తనయుడు, బిపిన్ రావత్ కుమార్తెలు కృతిక, తారిణి రాష్ట్రపతి నుంచి అవార్డును అందుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి నుంచి స్వీకరించారు.
పారాలింపిక్ విజేత దేవేంద్ర రaరaరియా (పద్మభూషణ్), సీరం ఇన్స్టిట్యూట్ ఎండీ సైరస్ పునావాలా (పద్మ భూషణ్), స్వామి సచ్చిదానంద (పద్మభూషణ్), హాకీ ప్లేయర్ వందనా కటారియా (పద్మశ్రీ), పారా షూటర్ అవనీ లేఖరా (పద్మశ్రీ), యోగా రంగంలో చేసిన విశేష కృషికి స్వామి శివానంద పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు.
ఈ సంవత్సరం 128 పద్మ అవార్డులను ప్రకటించగా, రెండు విడుతల్లో అవార్డుల ప్రదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 107 పద్మశ్రీ అవార్డులను కేంద్రం వివిధ రంగాల్లో చేసిన కృషికి అవార్డులను ప్రకటించింది. 34 మంది మహిళలు, మరణానంతరం 13 మందికి, పలువురు విదేశీలకు సైతం కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది.













