ఆన్ లైన్ లో రాష్ట్రపతి క్రీడా పురస్కారాల ప్రదానం
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పలువురు క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్రీడా పురస్కారాలను అందజేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మొదటిసారిగా వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది దేశంలోని పలువురు క్రీడాకారుల ప్రతిభను తగిన గుర్తింపుతో సత్కరిస్తారు. ఈ క్రమంలో అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అథ్లెట్లకు ఇటీవల క్రీడా పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదుగురికి ఖేల్ రత్న, 27 మందికి అర్జున అవార్డులతో పాటు మొత్తం 75 మందికి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. క్రీడాకారులు సాయ్ కేంద్రాల్లో ఈ అవార్డుల్ని అందుకున్నారు. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చంఢగీర్, బెంగుళూరు, పూణే, సోన్‌పేట్, భోపాల్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, ఐపిఎల్ నిమిత్తం యుఎఇకి వెళ్లిన రోహిత్, ఇషాంత్‌లు తరువాత పురస్కారాలను స్వీకరించనున్నారు.













