నేటి నుంచి పార్లమెంట్ షురూ
నేటి నుంచి బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు దశలుగా ఈ సమావేశాలు జరుగుతాయి. మొదటి దశ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఆ రత్వాత ఉభయ సభలు జరుగుతాయి. మొదటి దశ జనవరి 29 నుంచి ఫిబ్రవి 15 వరకు కాగా, రెండో దశ మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు సాగుతాయి. గత పార్లమెంట్ సమావేశాల్లాగే ఈ సమావేశాలు కూడా షిఫ్టుల వారీగా జరగనున్నాయి. ప్రతిరోజు నాలుగు గంటల చొప్పున లోక్సభ, రాజ్యసభ సమావేశం అవుతాయి. జీరో అవర్, ప్రశ్నోత్తరాలు యథావిథిగానే కొనసాగుతాయి. కరోనా కారణంగానే ఈ షిఫ్టుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక.. ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న 16 పార్టీలు
రైతు వ్యవసాయ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిని నిరసిస్తూ రాష్ట్రపతి కోవింద్ ప్రసంగాన్ని బహిష్కరిస్తామని 16 పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఎన్సీపీ, శివసేన, సమాజ్వాదీ, ఆర్జేడీ, సీపీఎం, ఆర్ఎస్నీ, పీడీపీ, అన్నాడీఎంకే తో పాటు మరికొన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని వెల్లడించాయి. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఇబ్బంది ఏర్పడుతుందని, ప్రజా పంపిణీ వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ… ప్రతిపక్షాల ఆమోదం లేకుండానే కొత్త చట్టాలను ఆమోదించారని మండిపడ్డారు. బలంతంగా వాటికి ఆమోదం వేయించుకున్నారని విమర్శించారు. అందుకే రైతులు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన హింస విషయంలో కుట్రదారులను బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆజాద్ పేర్కొన్నారు.













