ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం….
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ప్రధాన సలహాదారు (ప్రిన్సిపల్ అడ్వైజర్) పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తాత్కాలికంగా ప్రజా జీవితానికి విరామం ఇస్తున్నా అని పేర్కొంటూ రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి పంపించారు. ఈ పరిణామం జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. నా భవిష్యత్ చర్యల కోసం ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగలేకపోతున్నా. ఈ విషయం మీకు కూడా తెలుసు. తాత్కాలికంగా ప్రజా జీవితం నుంచి కొంత విరామం కోరుకుంటున్నా. సలహాదారు పదవిని స్వీకరించలేను. అన్యథా భావించకుండా నా విజ్ఞప్తిని పరిశీలించి ఆ బాధ్యతల నుంచి నన్ను తొలగించాలి అని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు లేఖ రాశారు.
పంజాబ్ కాంగ్రెస్‌లో ఓ వైపు అంతర్గత పోరు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీసుకున్న ఈ నిర్ణయం సీఎం అమరీందర్ సింగ్‌ను నిరాశపర్చింది. ఈ ఏడాది మార్చిలో ప్రశాంత్ కిషోర్‌ను తన ప్రిన్సిపల్ సలహాదారుగా అమరీందర్ సింగ్ నియమించారు. ఆయనకు కేబినెట్ హోదా కూడా కల్పించారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఆ బాధ్యతలను చేపట్టలేదని తెలుస్తున్నది.













