400 మందితో నామినేషన్ వేయిస్తా: దిగ్విజయ్ సింగ్
లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ తన నియోజకవర్గంలో 400 మందితో నామినేషన్ వేయిస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి దిగ్విజయ్ సింగ్ ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గ పరిథిలోని కచ్నారియా గ్రామంలో ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాజ్‌గఢ్‌లో బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ జరగాలని ప్రజలు కోరుకుంటే అలాగే జరుగుతుందన్నారు. ఈవీఎంలో నోటాతో కలిపి అత్యధికంగా 384 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే ఇవ్వగలరని, అంతకంటే ఎక్కువమంది అభ్యర్థులుంటే తప్పనిసరిగా బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని చెప్పిన దిగ్విజయ్.. అందుకే ఈ దఫా ఎన్నికల్లో కనీసం 400 మందితో నామినేషన్ వేయించాలనుకుంటున్నామని, అందుకోసం తాను సిద్ధమవుతున్నానని తెలిపారు.
అంతేకాకుండా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ వివరాలను కూడా దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. “ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారైతే రూ.12,500 నామినేషన్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులైతే రూ. 25,000 చెల్లించాల్సి ఉంటుందం”టూ దిగ్విజయ్ వివరించారు.













