ధోనీ పై ప్రముఖుల పొగడ్తల జల్లు…
మిస్టర్ కూల్…మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ థోనీ రిటైర్మెంట్ ప్రకటనపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ట్వీట్ల ద్వారా ధోనీ పట్ల తమ గౌరవాన్ని వెల్లడిస్తున్నారు. ఆత్మ విశ్వాసం ఉంటే ఎంత గొప్ప విజయాలు సాధించవచ్చో నిరూపించి, ఒక చిన్న వెనుకబడిన ప్రాంతం నుంచి స్ఫూర్తి దాయక విజయాలు సాధించిన వ్యక్తిగా ఎంతో మందికి రోల్‌మోడల్‌గా నిలిచినందుకు ధాంక్యూ అంటూ అగ్రశ్రేణి నటుడు, రాజకీయనేత కమల్ హాసన్ అభినందించారు.
చెన్నైతో ధోనీ అనుబంధం కొనసాగాలని ఆకాంక్షించారు. ఇక ధోనీ రిటైర్మెంట్ నిర్ణయంతో భావొద్వేగానికి లోనయ్యానని కళ్లు చెమర్చాయని అతని ఆటతీరు తనకెంతో గర్వంగా అనిపిస్తుందని హీరో మహేష్‌బాబు ట్వీట్ చేశారు. నువ్వు మాకు వినోదాన్ని పంచావు, మమ్మల్ని గర్వపడేలా చేశావు. అన్నింటికన్నా నీ నిశ్చలమైన నడవడికతో ఎంతో మందికి టార్చ్‌బేరర్‌గా నిలిచావు అంటూ దర్శకులు రాజమౌళి ప్రశంసించారు. 2011లో వరల్డ్ కప్ గెలుపు అందించిన సిక్సర్‌ను ఎన్నటికీ మరువలేనన్నారు. ఆ షాట్ కొట్టిన ధోనీ ఫొటో ను కూడా ఆయన షేర్ చేశారు. భారతీయ క్రికెట్లో ఒక అధ్యాయం ముగిసిందని, ఒక గొప్ప ఆటగాడు, ఒక అసాధారణ కెప్టెన్, గ్రౌండ్లోనూ, బయటా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ధోని అని సినీ నటి తాప్సీ పన్ను కొనియాడారు. ధోనీ ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్ అంటూ ప్రస్తుత భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ స్పందించాడు. ఆట నుంచి నువ్వు రిటైరవగలవు గానీ మా హృదయాల నుంచి ఎప్పటికీ రిటైర్ కాలేవు అంటూ బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఒక అసాధారణ ఆటగాడిగా మాత్రమే కాక తన ప్రవర్తనతో, ప్రయాణంతో ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచినందుకు ధోనీ అంటే తనకు ప్రత్యేక గౌరవమన్నారు
బాలీవుడ్ నటి యామీ గౌతమ్. ధోనీ అద్భుతమైన ఆటగాడని, అతని ఆటలో కపిల్ పోలికలు కనిపిస్తాయని వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. మమ్మల్ని గర్వపడేలా చేసినందుకు ధాంక్యూ అంటూ బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ధోనికి ధ్యాంక్స్ చెప్పాడు. తాను పనిచేసిన వారిలో ధోనీ అద్భుత క్రికెటర్ అని మాజీ ఇండియన్ క్రికెట్ కోచ్ గ్రెగ్ చాపెల్ కొనియాడారు.ధోనీ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయన్నారు. మళయాళనటుడు మోహన్‌లాల్, నటి ప్రయిమణి, రానా దగ్గుబాటి… ఇంకా ఎందరెందరో ప్రముఖులు ధోనీ పట్ల తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు.













