షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు … ఈసీ
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల వాయిదా ఉండదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశిల్ చంద్ర వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఆరంభంలో శాసనసభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో సమావేశమైన ఈసీ రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోనూ పర్యటించింది. అక్కడ అన్ని రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయ్యింది. లఖ్‌నవూలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఈసీ సుశిల్ చంద్ర అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత నిచ్చారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.













