శిర్డీ సాయిబాబాను సందర్శించుకున్న ప్రధాని మోదీ
మహారాష్ట్రలోని ప్రసిద్ధ శిర్డీ సాయిబాబా మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద దర్శన్ క్యూ కాంప్లెక్స్‌ను ఆరంభించారు. ఈ సందర్భంగా అహ్మద్‌నగర్ జిల్లాలోని నిల్వండే డ్యామ్‌కు జల పూజ చేశారు. ఆ తర్వాత డ్యామ్ ఎడమకాలువను ప్రారంభించారు. 85.కి.మీ. మేర పొడవైన ఈ కాలువ వల్ల 182 గ్రామాలు లబ్ధి పొందనున్నాయి. అలాగే నమో షెత్కారీ మహాసన్మాన్ నిధి యోజనను ఆవిష్కరించారు. ఈ పథకం వల్ల మహారాష్ట్రలో 86 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. వైద్య, రవాణా, ఇంధనం ఇలా పలు రంగాలకు సంబంధించి రూ.7500 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన చేశారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయింపులు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా ప్రధాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పాల్గొన్నారు.













