ముగిసిన హీరాబెన్ అంత్యక్రియలు.. తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి. తొలుత గుజరాత్ గాంధీనగర్లోని ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. మాతృమూర్తి పాడెను మోదీ మోశారు. అంతిమయాత్ర వాహనంలోనూ తల్లి పార్థివదేహం వద్దే కూర్చొని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. గాంధీనగర్లోని శ్మశానవాటికలో హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి చేశారు. మోదీ తన సోదరులతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియల్లో మోదీ కుటుంబ సభ్యులతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హీరాబెన్ మృతి వార్త తెలుసుకుని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న హీరాబెన్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.













