మహమ్మారిని తలుచుకుంటూ కన్నీటి పర్యంతమైన ప్రధాని మోదీ

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలోని ఆరోగ్య కార్యకర్తలతో వర్చువల్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా మృతులను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నిన్న మొన్నటి వరకు మన పక్కనే ఉన్న చాలా మందిని కోవిడ్ బలి తీసుకుంది. వారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాను. వైద్యులు, మొదటి శ్రేణి కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ పై పోరాటం చేస్తున్నారు’’ అని మోదీ అభినందించారు.
బ్లాక్ ఫంగస్ ఓ సవాల్…
కరోనా కల్లోల సమయంలోనే బ్లాక్ ఫంగస్ కూడా సవాలు విసురుతోందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పరిశుభ్రత పాటించాలని, కాశీ నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాశీకి, అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ముఖ్యంగా వైద్యులు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు అని మోదీ పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్తగా బ్లాక్ ఫంగస్ వస్తోందని, ఇదో కొత్త రకం కలవరమని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారులను కాపాడుకుందాం….
గ్రామీణ ప్రాంతాల్లోకి చొరబడుతున్న కరోనాపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి నిలపాలని మోదీ సూచించారు. ప్రజల్ని ఎంత మెరుగ్గా చూసుకుంటే అక్కడి వైద్య వ్యవస్థపై అంత తక్కువ ఒత్తిడి పడుతుందని అన్నారు. ముఖ్యంగా చిన్నారులను కాపాడుకోవాలని, గతంలో పిల్లలపై కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉండేదన్నారు. అలాగే గతంలో చిన్నారులపై పలు వ్యాధులు ప్రభావం చూపాయని, వాటిపై విజయం సాధించామని పేర్కొ్న్నారు. చిన్నారులను సురక్షితంగా ఉంచేందుకు వీలుగా సాధ్యమైన మెరుగైన పద్ధతులను వాడాలని మోదీ వైద్యులకు సూచించారు.