సనాతన ధర్మం వివాదంపై .. మోదీ కీలక వ్యాఖ్యలు
సనాతన ధర్మం వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటోందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్లోని బినాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎంకే నేత, తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే మోదీ నుంచి స్పందన వచ్చింది. వారు (ప్రతిపక్షాల కూటమిని ఉద్దేశించి) ఇటీవల ముంబయిలో సమావేశం నిర్వహించారు. ఘమండియా (దురహంకారి) కూటమిని నడిపేందుకు కోసం వ్యూహాలను వారు సిద్ధం చేసుకొని ఉంటారని అనుకుంటున్నా. భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహం. వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన భారతీయుల విశ్వాసాలు, సంప్రదాయాలపై దాడి చేయాలని వారు నిర్ణయానికొచ్చారు. లోకమాన్య తిలక్, స్వామి వివేకానంద వంటివారికి స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటున్నారు అంటూ మోదీ మండిపడ్డారు.













