హఠాత్తుగా వెబినార్ లో ప్రత్యక్షమైన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఓ కార్యక్రమానికి అనుకోని అతిథి అయ్యారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆనందంలో మునిగిపోయారు. సీబీఎస్‌ఈ 12 వ తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ అభిప్రాయాల నిమిత్తమై విద్యార్థులు, తల్లిదండ్రులతో ఓ వెబినార్ నిర్వహించింది. వెబినార్ జరుగుతూండగా, ప్రధాని మోదీ హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఈ కార్యక్రమం మోదీ షెడ్యూల్‌లో లేదు. దీంతో అధికారులు, పిల్లలు తీవ్ర ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారు. అయితే కొద్దిసేపు మాత్రమే మోదీ ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు కావడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… ‘‘భవిష్యత్తు గురించి ఆలోచించండి. జూన్ 1 వరకూ మీరందరూ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారు’’ అని మోదీ పేర్కొన్నారు. దీనికి ఓ విద్యార్థి సమాధానమిస్తూ… ‘‘సార్… మీరు పరీక్షలను పండగలా జరుపుకోవాలని అన్నారు. అందుకే మాకెలాంటి భయమూ లేదు. పరీక్షల గురించి భయం లేదు’’ అని ఓ విద్యార్థి సమాధానమిచ్చింది. ఆయా పాఠశాలల్లో, కాలేజీలో ‘టీం స్పిరిట్’ బోధించారని, కోవిడ్ సమయంలో ఈ విషయాన్ని గమనించామని మోదీ పేర్కొన్నారు. కోవిడ్‌పై విజయం సాధిస్తామన్న ధీమాతోనే ప్రజలు ఆలోచించారని, విద్యార్థులందరూ దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తారన్న నమ్మకం తనకుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.