రైతుల కన్నీరు తుడిచే సమయం కూడా లేదా? ప్రియాంక ఫైర్
రైతుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ దారుణంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. వరుసగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ అహంకారంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు ఇష్టంలేని సాగు చట్టాలను రద్దు చేయాలని లక్షలాది మంది డిమాండ్లు చేస్తున్నా పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. యూపీలోని ముజఫర్ నగర్లో జరిగిన ‘కిసాన్ పంచాయత్’ లో ఆమె పాల్గొన్నారు. ‘‘ప్రధాని మోదీ నియంతలా ప్రవర్తిస్తున్నారు. ఓటు వేసి అధికారాన్ని కల్పించిన వారి సమస్యలను ఓపికగా వినడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు.’’ అని విరుచుకుపడ్డారు.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చల్లటి చలిలో ఢిల్లీ పొలిమేరల్లో నిరసన వ్యక్తం చేస్తున్నా… మోదీ పట్టించుకోలేదని, పైగా వారిని అవమానించేట్లు మాట్లాడారని ఆమె మండిపడ్డారు. రైతులను ఉగ్రవాదులు, ఖలిస్తానీ ఉగ్రవాదులు, పరజీవి, ఆందోళన జీవి లాంటి పద ప్రయోగాలు చేసి వారిని నొప్పించారని అన్నారు. రైతుల కుమారులు దాదాపు సరిహద్దుల్లో దేశ రక్షణ నిమిత్తమై జవాన్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారేనని, సాగు చట్టాలను వెనక్కి తీసుకోకుండా మోదీ సర్కార్ జవాన్లను అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. రైతుల దుస్థితిని చూసి కనీసం వారి కన్నీరు తూడ్చే స్థితిలో కూడా లేరని, రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నా, మోదీ స్నేహితులు మాత్రం కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారంటూ ఆరోపించారు. తమ స్వార్థం, కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే మోదీ రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల కోసం ఏమాత్రం చేయడం లేదని మండిపడ్డారు.
రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతానికి విద్యుత్తు, నీటి సరఫరాల్లో కోతలు విధించారని, రైతులపై పోలీసులు దాడులకు దిగుతున్నారని గుర్తు చేశారు. రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా, ఢిల్లీ పొలిమేరల్లో బారికేడ్లు, వాటర్ కేనన్స్ పెట్టి, అంతర్జాతీయ సరిహద్దుల రూపాన్ని ఇచ్చారని ఆమె ఎద్దేవా చేశారు. 16,000 కోట్ల రూపాయలతో ఖరీదైన విమానాలను కొనుగోలు చేస్తున్నారని కానీ, చెరకు ధరను పెంచడం లేదని, బకాయిలను రద్దు చేయడం లేదని ఫైర్ అయ్యారు. నూతన సాగు చట్టాలతో కనీస మద్దతుధర, మండీల వ్యవస్థ నిర్వీర్యమవుతుందని పునరుద్ఘాటించారు. కొన్ని కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అమ్మేయాలని చూస్తున్నారని, అంతేకాకుండా రైతుల భూములను కూడా కార్పొరేట్లకు అమ్మేయాలని చూస్తున్నారని ప్రియాంక ఆరోపించారు.













