ప్రవాసి భారతీయ దివస్ లో ప్రధాని మోదీ
ప్రస్తుతం మనం ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ నలుమూలలతో సంబంధాలు కలిగి ఉన్నామని, అయినా మన మనసులు మాత్రం ఎల్లప్పుడూ మాతృదేశంతోనే సంబంధాలు కలిగి ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 16వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షస్ను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించిన ప్రధాని.. గత కొన్ని సంవత్సరాలుగా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐలు) ఇతర దేశాల్లో మరింత బలోపేతమయ్యారని తెలిపారు. దేశంలో కరోనా ప్రభావం మొదలైన కొత్తలో భారత్ పీపీఈ కిట్లను, మాస్కులను, వెంటిలేటర్లను, టెస్టింగ్ కిట్లను బయటి నుంచి దిగుమతి చేసుకునేదని, కానీ ఇప్పుడు ఆ విషయంలో మన దేశం స్వావలంబన సాధించిందని చెప్పారు. ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ సంస్థలు తయారు చేసిన రెండు వ్యాక్సిన్లతో మానవాళిని రక్షించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
భారత్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోనేందుకు గట్టిగా నిలబడటంతో ఇప్పుడు ప్రపంచమంతా ఉగ్రవాదాన్ని ఎదిరించే శక్తిసామర్థ్యాలను కూడగట్టుకున్నదని ప్రధాని తెలిపారు. అదేవిధంగా దేశంలో అవినీతి అంతానికి భారత్ సాంకేతికతను వినియోగిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద ఇచ్చే లక్షల, కోట్ల సొమ్ము దళారుల చేతికి వెళ్లకుండా ఇప్పుడు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో పడుతున్నదని ప్రధాని పేర్కొన్నారు.













