ప్రపంచానికి ఇంధనం ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదగాలి: మోదీ
భారత్లో సహజ వనరులను ఉపయోగించుకొని, ప్రపంచానికి ఇంధనాన్ని అందించే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ పర్యటనకు వెళ్లిన ఆయన.. మెహసానా జిల్లాలోని మొధేరా గ్రామాన్ని దేశంలోని తొలి సోలార్ విద్యుత్ గ్రామంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగానే దేశానికి మొధేరా తెలుసుననిని, ఇకపై దేశ ప్రజలంతా దీన్ని సూర్య గ్రామంగానే గుర్తిస్తారని అన్నారు. అదే సమయంలో ప్రజలకు శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మెహసానా ప్రజలు గతంలో నీళ్లు, విద్యుత్ కోసం ఎన్నో అవస్థలు పడ్డారని గుర్తు చేసిన మోదీ.. మహిళలు నీళ్లకోసం చాలా దూరం నడవాల్సి వచ్చేదని చెప్పారు. కానీ ఈ తరానికి ఆ బాధల్లేవని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో పరిశ్రమలను తీసుకొస్తున్న ప్రభుత్వం.. పర్యాటక రంగాన్ని మెరుగుపరచడంతోపాటు కనెక్టివిటీని కూడా పెంచుతోందని కొనియాడారు.













