విజయం మాదే.. వచ్చే ఐదేళ్ల రోడ్‌మ్యాప్ కూడా రెడీ : పీఎం మోదీ ధీమా
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఎన్నికల నగారా మోగించేశాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్నవి కాదని, ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా జరగబోతున్న ఎన్నికలని ఆయనన్నారు. అలాగే 3వ సారి పాలన సాగించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తంచేశారు.
అనంతరం అవినీతిని అణచివేస్తూ, అవినీతి నేతలను ఏరిపారేస్తున్న తమ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్న విపక్షాలపై ప్రధాని విమర్శలు గుప్పించారు. గత పదేళ్లుగా అవినీతిపై తమ ప్రభుత్వం పోరాటం సాగిస్తున్నామని, కానీ ఈ పోరాటం కొందరికి ఇబ్బందిగా మారిందన్నారు. ‘భ్రష్టాచార్ హఠావో’ అనేది మోదీ మంత్రమని, ‘భ్రష్టాచార్ బచావో’ అనేది వాళ్ల (విపక్షాల) మంత్రమని విమర్శించారు. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్న ఎన్నికలు కావని, అభివృద్ధి భారత్ లక్ష్యంగా జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కూడా ఎన్డీయే సర్కారే అధికారంలోకి వస్తుందని, 3వ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమ కూటమి సిద్ధంగా ఉందని చెప్పారు.
రాబోయే ఐదేళ్లకు రోడ్‌మ్యాప్ కూడా సిద్ధం చేశామని తెలిపారు. మూడో దఫా అధికారంలోకి రాగానే తొలి 100 రోజుల్లో చేయాల్సిన కీలక పనులపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. అసాధారణ రీతిలో పెట్టుబడులు, యువతకు నూతన అవకాశాల కల్పన, మహిళా సాధికారత, కొత్త తీర్మానాలతో దేశం పురోగమిస్తోందని, దేశ సామర్థ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంటోందని, యావత్ ప్రపంచం ఇండియా వైపే చూస్తోందని పేర్కొన్నారు.













