రాజ్యసభలో ప్రధాని మోదీ కన్నీరు…
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ త్వరలో పదవీ విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా పెద్దల సభలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజాద్‌కు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ నేతతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఉద్యోగాలు, పదవులు, అధికారులు వస్తాయి. పోతాయి.. కానీ వాటిని ఎలా నిర్వహించాలో ఆజాద్‌ను చూసి నేర్చుకోవాలి. నాకు ఆజాద్ ఎంతోకాలంగా తెలుసు. నేను గుజరాత్‌కు సీఎం కాకముందు నుంచీ ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని. జమ్మూకశ్మీర్‌లో గుజరాతీ యాత్రికులపై ఉగ్రదాడి జరిగినప్పుడు నాకు ముందు ఫోన్ చేసింది ఆజాదే. ఆ రాత్రి నాకు ఫోన్ చేసి దాడి గురించి ఆయన చెబుతూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ రక్షణ మంత్రిగా ఉన్నారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల మృతదేహాలను గుజరాత్‌కు తరలించాలని ప్రణబ్‌దా భారత వాయుసేనను కోరారు. ఆ తర్వాత ఆజాద్ మళ్లీ ఫోన్ చేసి నేను ఎయిర్‌పోర్టులో ఉన్నానని చెప్పారు. ఆయన నాకు నిజమైన స్నేహితుడు, ప్రతి ఒక్కరినీ ఆయన తన కుటుంబసభ్యుల్లాగే చూసుకుంటారు అని మోదీ కన్నీళ్లతో చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆజాద్ సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆయన స్థానాన్ని భర్తీ చేసే నేత లేరని కొనియాడారు. కేవలం పార్టీ కోసమే కాగా, సభ.. దేశం కోసం ఆందోళన చెందే వ్యక్తి ఆజాద్ అని ప్రశంసలు కురిపించారు. ఆయనను ఎప్పటికీ రిటైర్ అవనివ్వబోనని, ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామని మోదీ తెలిపారు. ఆజాద్‌తో పాటు పలువురు రాజ్యసభ సభ్యులు వచ్చేవారం పదవీ విరమణ పొందుతున్నారు.













